fdd

 

న్యూఢిల్లీ:ప్రపంచంలోనే అద్భుతమైన రాజధాని నిర్మిస్తామని చెప్పి బడి పిల్లల నుంచి వసూలు చేసిన చందాలు, ఇటుకలు ఏమయ్యాయని వైసీపీ ఎంపీ నందిగాం సురేష్‌.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించారు. రాజధాని నిర్మాణం మాటున టీడీపీ భారీ కుంభకోణం చేసిందని, ఆయన బినామీలు భారీగా భూములు కొనుగోలు చేశారని ఆరోపించారు. ఢిల్లీలో బుధవారం సురేష్‌ మీడియాతో మాట్లాడారు.


 


శంకుస్థాపనకు లక్షల ఇటుకలు ఇచ్చారని, ఆ ఇటుకలు ఏమయ్యాయో తెలియదన్నారు. విద్యార్థులతో రూ.10 చొప్పున చందాలు వసూలు చేశారని, ఆ డబ్బులు ఏం చేశారో కూడా అర్థం కావడం లేదన్నారు. తాత్కాలిక భవన నిర్మాణాలతో ఎక్కువ కమీషన్లు తీసుకోవచ్చని చంద్రబాబు భావించి అడ్డగోలుగా దోచుకున్నారని, అలాంటి అమరావతిలో మళ్లీ ఏ ముఖం పెట్టుకొని పరేడ్‌ చేస్తారని మండిపడ్డారు. రాజధాని ప్రాంతంలో రెండే రెండు బిల్డింగ్‌లు కట్టారని, ఒకటి హైకోర్టు, మరొకటి తాత్కాలిక సచివాలయమన్నారు. భూములు ఇచ్చిన రైతులను దారుణంగా మోసం చేశారని ధ్వజమెత్తారు. టీడీపీ నేతలు ఇప్పుడేమో రూ.9 వేల కోట్లు రాజధానికి ఖర్చు చేశామని చెబుతున్నారు. ఆ డబ్బులకు మాత్రం లెక్క చెప్పడం లేదన్నారు. చంద్రబాబు 40 ఏళ్ల అనుభవమంతా కూడా కుట్రలు, మోసాలేనని విమర్శించారు. చంద్రబాబు అమరావతిలో పరేడ్‌ చేసేందుకు అనర్హులు అన్నారు. వైఎస్‌ జగన్‌పై నమ్మకంతో ప్రజలు 151 సీట్లు ఇచ్చారన్నారు.